చిత్రం : విప్రనారాయణ(VipranArAyaNa) (1954)
రచన : సముద్రాల రాఘవాచార్యులు
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : ఎ.ఎం.రాజా
19 November - నేడు ఎ.ఎం.రాజా జయంతి
పల్లవి :
మేలుకో శ్రీరంగా మేలుకోవయ్యా
మేలుకోవయ్యా మమ్మేలుకోవయ్యా
భాసిల్లెనుదయాద్రి
బాల భాస్కరుడు
వెదజల్లె నెత్తావి విరబూచి విరులు
విరితేనెలాని మైమరచు తుమ్మెదలు
లేచెను విహగాళి లేచెను నిదుర
చల్లచల్లగ వీచె పిల్ల తెమ్మెరలు
రేయి వేగినది వేళాయె పూజలకు॥
చరణం :
పరిమళద్రవ్యాలు బహువిధములౌ
నిధులు గైకొని దివ్యులు
కపిలధేనువును అద్దమ్ముపూని
మహర్షి పుంగవులు
మురువుగా పాడ
తుంబురు నారదులును
నీ సేవకై వచ్చి నిలచియున్నారు
సకుటుంబముగ సురేశ్వరులు
కానుకలు గైకొని మొగసాల
కాచియున్నారు ॥
దేవరవారికై పూవుల సరులు
తెచ్చిన తొండరడిప్పొడి మురియ
స్నేహదయాదృష్టి చిల్కగా జేసి
సెజ్జను విడి కటాక్షింప రావయ్యా॥
Special Note:
రాజా పూర్తిపేరు ‘అయిమల మన్మథరాజు రాజా’. స్వస్థలం చిత్తూరులోని రామాపురం. తెలుగులో ‘శుభోదయం’ చిత్రం ద్వారా గాయకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత సంక్రాంతి చిత్రంలో పాడిన పాటల ద్వారా రాజా ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు. ఆయన గానమాధుర్యం పెళ్లికానుక, మిస్సమ్మ, అప్పుచేసి పప్పుకూడు లాంటి చిత్రాలకు ప్రజాదరణ పెంచింది. ఎన్నో లలితసంగీత కచేరీలు చేశారు. పక్కింటి అమ్మాయి, అశ్వత్థామ చిత్రాలలో నటించారు. తెలుగులో ‘శోభ’, ‘పెళ్లికానుక’ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. విలక్షణమైన ఆయన గొంతు సంగీత జగత్తులో ప్రత్యేక స్థానాన్ని ఇచ్చింది.