chilikinta chiguru - చిలికింత చిగురు
చిత్రం : చిరంజీవులు (1956)రచన : మల్లాది రామకృష్ణశాస్త్రి
సంగీతం : ఘంటసాల
గానం : ఘంటసాల, పి.లీల
17 June - నేడు మల్లాది రామకృష్ణశాస్త్రి జయంతి
పల్లవి :
చిలికింత చిగురు సంపంగి గుబురు
చినదాని మనసూ చినదాని మీద మనసూ
హోయ్... ॥
మనసైన చినదానికి అందానికీ (2)
కనుసైగ మీద మనసూ (2)
చరణం : 1
అరె... చెంపకు చారడేసి కన్నులున్న చిన్నదీ
చిన్నదాని సిగలో రేకలెన్నో
గువ్వకన్ను రైకమీద చుక్కలెన్నో
ఎన్నుకో వన్నెలెన్నుకో చిన్నెలెన్నుకో (2)
వన్నె చిన్నెలెన్నుకో ఎన్నికైన చిన్నవాడా
పైరుగాలి ఘుమఘుమలో
చెంగావి చెంగు రిమరిమలో
చరణం : 2
దిరిసెన పూవుమీద చిలుకూ ముగ్గులూ
చిన్నారి బుగ్గమీద చిలిపీ సిగ్గులూ
మల్లెల దొంతరలూ మరువల్లే దొంతరలూ
మనసే... మనసే మరుమల్లెల దొంతర
మన ఊసే విరజాజి దొంతర
పాలవెన్నెలలో మురిపాల వెన్నెలలో॥
Special Note:
పూర్తి పేరు : మల్లాది రామకృష్ణశాస్త్రి
జననం : 17-06-1905
జన్మస్థలం : కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం
తల్లిదండ్రులు : కనక వల్లి, నరసింహశాస్త్రి
తోబుట్టువులు : నలుగురు చెల్లెళ్లు (కృష్ణవేణి, మహాలక్ష్మి, వెంకటరమణ, మంగతాయారు), కృష్ణవేణి తర్వాత మగపిల్లలు కవలలు పుట్టి చనిపోయారు. మహాలక్ష్మి తర్వాత మరో మగశిశువు శ్రీనివాస్ ఏడాది పెరిగి చనిపోయారు.
చదువు : ఎం.ఎ
వివాహం - భార్య : 1920 - వెంకటరమణ
సంతానం : ఇద్దరు కుమారులు (నరసింహశాస్త్రి, సూరిశాస్త్రి)ఇద్దరు కుమార్తెలు (రాజ్యలక్ష్మి, సర్వలక్ష్మి)
తొలిచిత్రం-పాట : చిన్నకోడలు (1952) - పిల్లనగ్రోవి పాటకాడ...
ఆఖరిచిత్రం : వీరాంజనేయ (1968) (మల్లాదివారి కథల్లోంచి ఒక పాటను తీసుకొని అత్తగారు-కొత్తకోడలు (1968) చిత్రంలో వాడారు)
పాటలు : 200 పాటలు (39 చిత్రాలకు)
ఇతరవిషయాలు : మల్లాది వారి పూర్వీకులు గూడూరు వాస్తవ్యులు. వీరి వంశానికి మూలపురుషుడు మల్లాది నారాయణశాస్త్రి. వీరిది తరతరాలుగా పండిత వంశం. వీరి వంశంలో అయిదవ తరానికి చెందినవారు మల్లాది రామకృష్ణశాస్త్రి. పుస్తక పఠనం, భారత భాగవత రామాయణ కథలు, చరిత్రలు, పద్యాలు ఇలా అన్నింటిపై చిన్నప్పటి నుండే ఇష్టం పెంచుకున్నారు. మల్లాదివారు ఏకసంథాగ్రాహి. కాలే జ్ చదువుకున్న రోజుల్లో ఆయనకు ‘విద్యాభూషణ‘ అనే బిరుదు ఉందని విషయం చాలా మందికి తెలియదు. మల్లాది వారి తొలికథ ‘భారతి‘లో అచ్చయినప్పుడు వారి వయస్సు పదిహేనేళ్లు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అన్ని పత్రికలలో ఆయన కథలు, కథానికలు అచ్చవడం, వాటికి మంచిపేరు రావడం జరిగింది. దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం ‘పల్నాటియుద్ధం’ చిత్ర రచన విషయంలో సలహాల కోసం 1945లో మల్లాదివారిని మద్రాసుకు ఆహ్వానించారు.
మరణం : 12-09-1965